జీవో 252లో కొన్ని సవరణలు చేయండి -మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన
జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలు
జీవో 252లో కొన్ని సవరణలు చేయండి  -మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన


హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)

జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది.

మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జీవో పై చర్చించడంతో పాటు వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తమ సంఘం ముఖ్యుల సమావేశం, 252జీవో ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, జర్నలిస్టుల నుండి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు, జీవో లో లోటుపాట్లపై చర్చించి, కొన్ని సవరణలు అవసరమనే అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రితో తెలిపారు. గతంలో అక్రెడిటేషన్ కార్డులతో డెస్క్ జర్నలిస్టులందరికీ కాకుండా కొందరికి మాత్రమే న్యాయం జరిగేదని, ప్రస్తుతం అలా కాకుండా బస్ పాస్ లతో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్షేమ పథకం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులనే తేడా లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి డెస్క్ జర్నలిస్టుకు వర్తింపజేసేలా జీవో లో సవరించాలని ఆయన కోరారు.

కేబుల్ టీవీ ఛానెల్స్ కు సంబంధించి, జీవో లో పేర్కొన్న అస్పష్టతను సరిచేయాలన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మండలానికి ఒకటి కాకుండా, సదరు మండలంలో ప్రధాన డేట్ లైన్ లను గుర్తించి, వాటి ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసేందుకు జీవో ను సవరించాలని కోరారు. చిన్న పత్రికలకు సర్క్యూలేషన్ ఆధారంగా జిల్లాల్లో కూడా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు.

ప్రధాన పత్రికలు, శాటిలైట్ న్యూస్ ఛానెల్స్ కు కార్డుల కుదింపు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, కెమెరా జర్నలిస్టులకు వారి కార్యాలయాల సిఫారసుల మేరకు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషా కనక, ఇతర భాషల సర్క్యూలేషన్ లతో, గ్రేడింగ్ లతో వాటిని పోల్చకుండా, ఉర్దూ పత్రికలు సర్క్యూలెట్ అవుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక కేటగిరి క్రింద జిల్లా, మండల స్థాయిల్లో ఉర్దూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా జీవో లో పొందుపర్చాలని కోరారు.

వెటరన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు పొందడానికి, జీవో లో పేర్కొన్న వృత్తి అనుభవాన్ని కొంత తగ్గిస్తూ సవరించాలని మంత్రిని ఆయన కోరారు. టీయూడబ్ల్యూజే అభ్యర్థనపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, త్వరలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి, ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసుకుందామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శులు కె. శ్రీకాంత్ రెడ్డి, వి.యాదగిరి, రాష్ట్ర కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, ఎం.డి.గౌస్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాష్ట్ర చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్ తదితరులు ఉన్నారు.

టీయూడబ్ల్యూజే సూచనలను పరిశీలిస్తాం

జీవో 252పై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం లిఖిత పూర్వకంగా చేసిన సూచనలను పరిశీలిస్తామని, మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాలు శాఖ కమిషనర్ ప్రియాంక హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సమావేశాన్ని నిర్వహించి జర్నలిస్టు సంఘాల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande