
కరీంనగర్, 29 డిసెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలోని పలు విభాగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తనిఖీలు ప్రారంభించగానే ఏసీబీ అధికారులు అప్రమత్తమై మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. లోపల ఉన్న సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా, బయట వారు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆయా విభాగాల రికార్డులపై ఏసీబీ దృష్టి సారించింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు