
మెదక్, 29 డిసెంబర్ (హి.స.)
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వ్యాపార కేంద్రమైన దుంపలకుంట చౌరస్తాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు దుకాణాల షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.రెండున్నర లక్షల రూపాయలు నగదుతో పాటు ఇతర బంగారు వెండి వస్తువులు, సెల్ ఫోన్లు, దుస్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దుంపలకుంట చౌరస్తాలోని ఎనగండ్లకు చెందిన జంగం జగదీష్ కిరాణం దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి తెరిచి కౌంటర్ లో దాచిన రూ. లక్షన్నర నగదుతో పాటు ఇతర వస్తువులు దోచుకెళ్లారు.
ఎదురుగా ఉన్న రంగంపేట కు చెందిన నవీన్ గౌడ్ సెల్ ఫోన్ దుకాణంలో 5 టచ్ సెల్ ఫోన్లు బంగారు, వెండి లాకెట్లు దోచుకెళ్లారు. పక్కనే ఉన్న మెడికల్ దుకాణంలో 20వేల నగదు తో పాటు వెండి లాకెట్ తో కూడిన కరుంగళీమాల ను, పక్కనే ఉన్న బట్టల దుకాణంలో బట్టలతోపాటు నగదును దోచుకెళ్లారు. సోమవారం ఉదయం వచ్చేసరికి నాలుగు దుకాణాల తాళాలు పగలగొట్టి ఉండడంతో బాధితులు లబోదిబో అంటూ ఏడుస్తూ కొల్చారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు