
శ్రీకాళహస్తి, 30 డిసెంబర్ (హి.స.)
సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య (Driver Rayudu) కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన బహిష్కృత నాయకులు, శ్రీకాళహస్తి మాజీ ఇంచార్జ్ కోట వినుత (Kota Vinuta), ఆమె భర్త చంద్రబాబుల నేతృత్వంలో ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోట వినుతకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు గత కొద్ది నెలల క్రితం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు సీ3 సెవెన్ వెల్స్ పోలీసు స్టేషన్‌లో (Seven Wells Police Station) సంతకం చేయాలని షరతు విధించింది. ఈ క్రమంలో కేసును చెన్నై సెవెన్ వెల్స్ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా కోట వినుత ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవిలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే మృతుడు రాయుడు మరణానికి ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఆ వీడియోలో రాయుడు తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ.. పేట చంద్ర, పేట చిరంజీవిల పేర్లను స్పష్టంగా ప్రస్తావించడం రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది.
ఈ క్రమంలో కోట వినుత పోలీసుల ఎదుట సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తోంది. ఈ హత్య వెనుక కేవలం తమ ప్రమేయమే కాకుండా, స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆమె వాదించారని సమాచారం. పేట చంద్ర, చిరంజీవిలు టీడీపీ నాయకులతో కుమ్మక్కై తమను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ కుట్రకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారని తెలియవస్తోంది. అయితే రాయుడు సెల్ఫీ వీడియోలో వెల్లడించిన అంశాల ప్రకారం.. కోట వినుత దంపతుల వ్యక్తిగత విషయాలను సేకరించాలని కొందరు ప్రత్యర్థులు తనకు డబ్బు ఆశ చూపారని, ఆ విషయాలు వినుతకు తెలియడంతోనే తనను చంపేందుకు ప్లాన్ చేశారని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం చెన్నై పోలీసులు సెల్ఫీ వీడియోలోని ఆధారాలను, వినుత ఆరోపణలను బేరీజు వేస్తూ నిందితులను విచారిస్తున్నట్లు పోలీసుల సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV