ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆస్థాన విద్వాంసులు.గరిమెళ్ళ.బాలకృష్ణ ప్రసాద్ మృతి
విజయవాడ, 10 మార్చి (హి.స.) రాజమహేంద్రవరం సాంస్కృతికం, అజన్మాంతం అన్నమయ్య కీర్తనలతో వెంకటేశ్వరుడిని నోరారా కీర్తించిన ఆ గొంతు గోదావరి తీరంలోనే ఊపిరి పోసుకుంది. చారిత్రక నగరి రాజమహేంద్రవరంలోనే విద్య అభ్యసించింది. ఆ మహా గాయకుడి మరణం నగరవాసులను కలచివేస
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆస్థాన విద్వాంసులు.గరిమెళ్ళ.బాలకృష్ణ ప్రసాద్ మృతి


విజయవాడ, 10 మార్చి (హి.స.)

రాజమహేంద్రవరం సాంస్కృతికం, అజన్మాంతం అన్నమయ్య కీర్తనలతో వెంకటేశ్వరుడిని నోరారా కీర్తించిన ఆ గొంతు గోదావరి తీరంలోనే ఊపిరి పోసుకుంది. చారిత్రక నగరి రాజమహేంద్రవరంలోనే విద్య అభ్యసించింది. ఆ మహా గాయకుడి మరణం నగరవాసులను కలచివేసింది. అతనితో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు గోదారి తీరంతో అనుబంధం ఉంది. ఆయన రాజమహేంద్రవరంలోనే జన్మించారు. ఆరో తరగతి నుంచి సంగీతంలో డిగ్రీ చేసేంత వరకు రాజమహేంద్రవరంలోని తమ ఇంట్లోనే పెరిగినట్లు గరిమెళ్ల పెద్దమ్మ కుమారుడు డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.మూర్తి తెలిపారు. బాలకృష్ణ ప్రసాద్‌ మృతి సంగీత లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి కార్యవర్గ సభ్యులు సైతం సంతాపం ప్రకటించి.. ఆదివారం సాయంత్రం గోదావరిగట్టున సమితి ప్రాంగణంలో జరుగుతున్న సంగీత ఉత్సవాల్లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమ సంస్థ నిర్వహించే ఉత్సవాల్లో రెండు పర్యాయాలు గరిమెళ్ల కచేరీలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ వద్ద తాను సంగీతంలో మెలకువలు నేర్చుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాజమహేంద్రవరం నగరానికి చెందిన కెనరా బ్యాంక్‌ ఉద్యోగి, సంగీత విద్వాంసుడు దేవులపల్లి గోపీకిశోర్‌ అన్నారు. అన్నమయ్య చేసిన పదార్చనకు గరిమెళ్ల కూర్చిన రాగాలు అపురూపమన్నారు. విశ్వమంతా పర్యటించి అయిదు వేలకు పైగా కచేరీలు చేసిన మహనీయుడని, ఆయన మరణం అత్యంత బాధాకరమని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande