, భీమవరం 10 మార్చి (హి.స.), స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అందిస్తున్న రుణాలను కొంత మంది సిబ్బంది దారి మళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అవి బయటపడిన తర్వాత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా సొమ్ముల రికవరీ లేకపోవడంతో ఆ భారమంతా గ్రూపు సభ్యులపై పడుతోందని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల లావాదేవీల్లో తరచూ మోసాలు బయట పడుతూనే ఉన్నాయి. వాయిదాల సొమ్ము బ్యాంకుల్లో జమ చేయకుండా పక్కదారి పట్టించడం, స్త్రీనిధి రుణాల మళ్లింపు, కొందరు సభ్యులు చెల్లించకపోవడంపై సంబంధిత సిబ్బందిపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కొంత మంది రిసోర్సు పర్సన్లు (ఆర్‌పీˆ) డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేయించేందుకు పర్సంటేజీలు దండుకుంటున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవో) కొంతమంది అక్రమాల్లో చేతులు కలుపుతున్నారు. కొన్నిచోట్ల గ్రూపు సభ్యులెవరో కూడా తెలియకుండా నకిలీ గ్రూపులతో రుణాలు పొందిన సంఘటనలూ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ఆ సొమ్ములకు లెక్కాపత్రం ఉండటం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల