ఏ.పీ, 10 మార్చి (హి.స.) ఈనెల 12న
చేపట్టిన 'యువత పోరు' ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు నిరసన కార్యక్రమంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, విద్యార్ధి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్ధి నాయకులు, మేధావులు, విద్యారంగ ప్రముఖులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని తెలిపారు. ఫీజు రీఇంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాడదామని సజ్జల వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..