తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 11 మార్చి (హి.స.)
జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారు శాంతినగర్ కు చెందిన మోత్కూరి కుమార్ (35) యువ రైతు అప్పుల బాధతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రైతు కుమార్ తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పత్తి, మిరప పంటలు పెట్టి, పంటలు పండకపోవడంతో రూ. 10లక్షలు అప్పుల పాలైనట్లు తెలిపారు. యాసంగిలో తన మొక్కజొన్న పంట అడవి పందులు, కోతుల బెడద వల్ల గత నాలుగు రోజులుగా రాత్రిపూట అక్కడే నిద్రిస్తున్నాడు.ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి పంట చేనులో పడుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే మంగళవారం ఉదయం గ్రామ శివార్లలో రోడ్డు పక్కన కుమార్ నురుగులు కక్కుతూ విగత జీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్