విజయవాడ, 2 మార్చి (హి.స.)
కదిరి, : రాష్ట్రమంతా కదిరి వైపు చూసేలా శ్రీఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం బ్రహ్మోత్సవాలపై అధికారులు, నాయకులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కల్యాణోత్సవం గొప్పగా చేయటంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆలయ ఆదాయం రూ.లక్షల నుంచి రూ.కోట్లకు చేరిందన్నారు. ఉత్సవాలను కుల, మతాలకు అతీతంగా మన ఊరి వేడుకనే భావనతో సహకరించాలని కోరారు. గతంలో తెదేపా ప్రభుత్వం అధికార లాంఛనాలతో పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎవరో ఒకరు బ్రహ్మోత్సవాలకు వస్తారని, రాష్ట్రం దృష్టిని కదిరికి మళ్లించేలా చేస్తామన్నారు. 15 రోజుల వేడుకలను ఎస్వీబీ చానల్‌తో ప్రత్యక్ష ప్రసారానికి కృషి చేస్తామన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేకతను చాటేలా ఏర్పాట్లు చేయటంపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఏడాదికి తిరువీధుల వెడల్పు, స్వామి వారి పుష్కరిణి అద్భుతమనిపించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈసారి చక్రస్నానానికి తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.పార్థసారథి, ఆర్‌డీఓ వీవీఎస్ శర్మ, ఈఓ శ్రీనివాసరెడ్డి, కమిషనర్ కిరణ్‌కుమార్, అర్చకులు అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల