విజయవాడ, 2 మార్చి (హి.స.)మొవ్వ మండలం కాజ పంచాయతీలో నిధులు స్వాహా అయ్యాయి. రూ. 10.77 లక్షలు దుర్వినియోగం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. కాజ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా సుద్దుల సురేంద్రబాబు 2023 డిసెంబరు 23వ తేదీన విధుల్లో చేరారు. అనంతరం ఆయనకు పంచాయతీ ఆదాయం, వ్యయం వివరాలకు సంబంధించిన రికార్డులు, కొంత నగదు అందించారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణప్రియాంక(గ్రేడ్-5), కాంట్రాక్ట్ ఉద్యోగి మంద హరీష్ కృష్ణారెడ్డిలు కలిసి వివిధ పన్నుల రూపేణా వసూలు చేసిన రూ.15,28,792లు జూనియర్ అసిస్టెంట్ సురేంద్రబాబుకు గ్రామ పెద్దల సమక్షంలో అందించారు.
అనంతరం సురేంద్రబాబు ఆ నగదులో కొంత మొత్తాన్ని పంచాయతీ ఖాతాలో జమ చేశారు. మిగిలిన నగదు సొంతానికి వినియోగించుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీవోలు తమ పరిశీలనలో గుర్తించారు. ఇలా సుమారు రూ.10.77 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ధ్రువీకరించుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జులైలో జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరులో ఎస్.సురేంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈవోపీఆర్డీ పరమాత్మను జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. ఈ క్రమంలో కాజ పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శి ప్రసాద్ గతేడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 17వ తేదీన జూనియర్ అసిస్టెంట్‌పై పంచాయతీ విస్తరణ అధికారి కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మూడేళ్ల పాటు పంచాయతీ నిధులను బ్యాంకులో ఎందుకు జమ చేయలేదని, అన్ని నిధులు ఎలా ఉంచారనే విషయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల