విజయవాడ, 2 మార్చి (హి.స.)
, లింగాల: అరటి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. సాధారణ రకాలతో పోల్చితే టిష్యూకల్చర్‌తో ఒకేసారి కోతకు రావడం, చీడ పీడలను తట్టుకోవడంతో రైతులు అరటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. టిష్యూకల్చర్ జీ-9 రకం అరటి నాటిన ఆరు నెలలకు గెలవేసి 10 నుంచి 11 నెలలకు ఫలసాయం అందుతోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, ధరలుండడంతో రైతులకు ప్రయోజనం కలుగుతోంది. జిల్లాలో సుమారు 45 వేల హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఎకరా సాగులో 1200 టిష్యూకల్చర్ విధానంలో అరటి మొక్కలు నాటుతారు. బిందు సేద్యం, సేంద్రియ ఎరువుల వినియోగంతో ఎకరాకు 25 టన్నుల దిగుబడి వస్తోంది. మహారాష్ట్రలో అరటి దిగుబడులు తగ్గడంతో జిల్లాలో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను బాక్సులతో రూ.22 వేల నుంచి రూ.23 వేలు, గెలలతో రూ.16 వేలు నుంచి రూ.18 వేలతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
పులివెందుల ప్రాంతంలోని పండించే అరటి వాహనాల్లో రోజుల తరబడి రవాణా చేసినా కాయ చెడిపోదు. అందుకే ఇక్కడ సాగైన అరటికి మంచి డిమాండు ఉంటోంది. దిల్లీకి చెందిన వ్యాపారులు సీజన్లలో పులివెందులలో మకాం వేసి ఇక్కడ పండించిన అరటిని కంటైనర్లలో ముంబయికి తరలించి అక్కడ నుంచి ఓడల ద్వారా గల్ప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కశ్మీర్, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాలకు దిగుబడులను తరలిస్తున్నారు. ఈ విషయమై పులివెందుల ఉద్యానాధికారి గువ్వా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ మొదటి, రెండో, మూడో కోత పంటలను వ్యాపారులు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తున్నారని, ధరలు విచారించి విక్రయిస్తే రైతులకు లాభాలొస్తాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల