తెలంగాణ, 2 మార్చి (హి.స.)
అధైర్య పడొద్దు అండగా ఉంటానని టీ స్టాల్ నిర్వాహకుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఆదివారం సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కేటీఆర్ను కలిశారు. నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు సార్ అని విలపించాడు. నా పని ఏందో నేను చేసుకొని బతుకుతుంటే కలెక్టర్ వచ్చి బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న మా టీ స్టాల్లో మీ ఫొటోను చూసి నా హోటల్ మూయించాడని కేటీఆర్తో గోడు వెళ్లబోసుకున్నారు.
రెండు రోజుల తర్వాత వచ్చి సామానుతో సహా హోటల్ డబ్బానే అధికారులు ఎత్తుకెళ్లారని వాపోయారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అధైర్య పడొద్దు.. నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రూ.10 లక్షలు ఖర్చయినా సరే శాశ్వత ఉపాధి చూపిస్తా.. మంచి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకో వారం, పది రోజుల్లో వచ్చి నేనే ప్రారంభిస్తా అని చెప్పారు. అద్దె భారం లేకుండా ప్రత్యామ్నాయ మార్గం నేనే చూపిస్తా అని కేటీఆర్ హామీనిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్