న్యూఢిల్లీ: , 4 మార్చి (హి.స.)స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై బాడీ షేమింగ్ పోస్టుతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ నేత షామా మహమ్మద్.. ఎట్టకేలకు స్పందించారు. రోహిత్ అభిమానులు, టీమిండియా మాజీలు, బీజేపీ, ఆఖరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
‘‘ఓ ఆటగాడు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే రోహిత్ శర్మ విషయంలో పరిశీలనపూర్వకంగానే నేను మాట్లాడా. అతను కాస్త ఓవర్‌వెయిట్ అనిపించాడు. అందుకే అలా ట్వీట్ చేశా. అందులో బాడీ షేమింగ్ ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు’’ అని అన్నారామె. ఈ క్రమంలో.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ల పేర్లను ప్రస్తావించిన షామా.. వాళ్లతో రోహిత్‌ను బాడీని పోల్చారు.
ఇది ప్రజాస్వామ్యం.. అందులో తప్పేం ఉంది. నాకు మాట్లాడే హక్కు ఉంది అని అన్నారామె. అలాగే.. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై షామా ప్రశంసలు గుప్పించారు. గతంలో పాక్‌పై ఓటమి తర్వాత మహమ్మద్ షమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలిచాడు. అందుకు కోహ్లీని కూడా విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు