ముంబయి: 4 మార్చి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించగా.. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మార్కెట్లో వాణిజ్య యుద్ధ భయాలతో దేశీయ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీనికితోడు ఐటీ, మెటల్ స్టాక్స్‌లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 351 పాయింట్లు కుంగి 72,732 వద్ద.. నిఫ్టీ (Nifty) 121 పాయింట్లు తగ్గి 21,997 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు