న్యూఢిల్లీ, 4 మార్చి (హి.స.) తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (EC)లకు నోటీసులు జారీచేసింది. మార్చి 22 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఈ సందర్భంగా జస్టిస్ బి.ఆర్. గవాయి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకు అనడమా? ప్రజాస్వామ్య విధానాలకు సరైన సమయం అవసరం. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు అంటూ వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..