దిల్లీ: , 5 మార్చి (హి.స.)చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై నమోదు చేసే పోక్సో కేసుల విచారణకు ట్రయల్ కోర్టుల్లో తగినంత మంది జడ్జీలు లేరని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రతి జిల్లాలో పోక్సో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంవంటి లక్ష్యాలు నెరవేరడం లేదని వ్యాఖ్యానించింది. 2019లో సుమోటోగా స్వీకరించిన ‘చిన్నారులపై అకృత్యాల పెరుగుదలపై ఆందోళన’ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 2019లో ఈ కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రతి జిల్లాలో కేంద్ర నిధులతో పోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 పోక్సో కేసులను ప్రత్యేకంగా విచారించాలని ఆదేశించింది. ఇంకా చిన్నారులపై అఘాయిత్యాలను నివారించేందుకు చైతన్యం తీసుకురావాలని, ప్రాసిక్యూషన్‌పై అవగాహన కల్పించాలని, థియేటర్లు, ఛానళ్లలో వాటిపై ప్రచారం చేయాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు