చెన్నై, 5 మార్చి (హి.స.)కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం (NEP) అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin).. మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు. తమిళంపై ప్రేమ ఉంటే.. చేతల్లో చూపించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి తమిళం అంటే అపారమైన ప్రేమ అని భాజపా (BJP) చెబుతోంది. అదే నిజమైతే.. దాన్ని ఆయన చేతల్లో ఎందుకు చూపించడం లేదు..?. పార్లమెంటులో సెంగోల్‌ను ఏర్పాటుచేయడం కంటే.. రాష్ట్రం (Tamil Nadu)లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుంది. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి.. మరిన్ని నిధులు కేటాయించండి. కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, సత్వర విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలి. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ వంటి పేర్లు పెట్టడం ఆపండి. దానికి బదులు తమిళ పేర్లను పెట్టండి. తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించండి’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు