విజయవాడ, 6 మార్చి (హి.స.): సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టాననే ఆరోపణలతో మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ ధ్రువపత్రం జారీ చేశాక 2019లో సినిమా విడుదల చేశామని, 2024లో కేసు నమోదు చేయడంలో అర్థం లేదన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, ఈ కేసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల