న్యూఢిల్లీ,, 6 మార్చి (హి.స.)యావత్తు దేశాన్ని 45 రోజుల పాటు భక్తి పారవశ్యంతో ఊపేసిన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై కాసులు వర్షం కురిపించింది. మరీ ముఖ్యంగా కుంభమేళాలో పడవలు నడిపిన ఓ కుటుంబంపై ఏకంగా రూ.30 కోట్లు కుమ్మరించింది. యూపీ అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఈ మేరకు ప్రకటన చేశారు. రూ.7,500 కోట్ల పెట్టుబడితో నిర్వహించిన మహా కుంభమేళా వల్ల రూ.3లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా 130 పడవలు కలిగిన ఓ కుటుంబం 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించిందని ప్రకటించారు. రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 చొప్పున 130 పడవల ద్వారా ఆ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందని వివరించారు. కుంభమేళా వల్ల హోటల్స్ రంగంలో రూ.40వేల కోట్లు, ఆహారం, నిత్యావసరాల రంగంలో రూ.33వేల కోట్లు, రవాణా రంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని సీఎం యోగి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా రూ.20వేల కోట్లు, విరాళాల రూపంలో రూ.660 కోట్లు, టోల్ ప్లాజాల ద్వారా రూ.300 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.66వేల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల