తెలంగాణ, వరంగల్. 6 మార్చి (హి.స.)వరంగల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా కు చెందిన కూలీలు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి బొలెరో వాహనంలో వెళుతుండగా నర్సంపేట మండలం ఇటుకాల పల్లి వద్ద నేడు తెల్లవారుజామున వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మరో 20 మందికి గాయాలయ్యాయి.
పరిమితికి మించి వాహనంలో ఎక్కించుకున్న డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నర్సంపేటకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్