హైదరాబాద్, 6 మార్చి (హి.స.)*
‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ ను నిలదీస్తామని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం తెలంగాణ సమాజం, ఆత్మబలిదానాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులదలకే అంకితమన్నారు. ఈ విజయాన్ని తాము మరింత బాధ్యతగా భావిస్తూ భవిష్యత్ లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
మిన్నంటిన విజయోత్సవ సంబురాలు..
ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో గురువారం నగర కార్యాలయంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించుకున్నారు. ఈ సంబురాలు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. సంబురాల్లో గెలిచిన అభ్యర్థులు మల్కా కొమురయ్య, అంజిరెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు, ముమ్మర ప్రచారం నిర్వహించి మోదీ నేతృత్వంలో విజయం సాధించేలా తీవ్ర ప్రయత్నాలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి శాలువాలతో పార్టీ వర్గాలు సన్మానించాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో జి.కిషన్ రెడ్డి మాట్లాడారు.
37 శాతం మద్ధతు..
విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, తెలంగాణ ప్రజలకు బీజేపీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు, సమాజానికి అంకితమిస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో గ్రామస్థాయిలో పనిచేసి గొప్ప ఫలితాలను రాబట్టారన్నారు. బీజేపీకి సంబధించినంత వరకు రెండు స్థానాల్లో ఏకకాలంలో విజయం సాధించడం అభినందనీయమన్నారు. 37 శాతం మంది బీజేపీకి మద్ధతు ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీజేపీని ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
తప్పించకునే ప్రయత్నాలను సమాజం గమనిస్తుంది..
పార్లమెంట్ లోనూ మెజార్టీ సీట్లు సాధించామన్నారు. తెలంగాణ సమాజం బీజేపీ బలపడాలని కోరుకుంటుందన్నారు. మూడు స్థానాల్లోని రెండు కీలక స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సత్తా మోదీ ఆధ్వర్యంలో బీజేపీకే ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేయడం, తప్పుడు ఆరోపణలు, వితండవాదం, తప్పించుకునే ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. అయినా ప్రజలు సీఎం మాటలు, ఆరోపణలను ఏనాడూ పట్టించకోలేదన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలనైనా హామీలను నెరవేర్చక ఎదురుదాడులకు దిగుతున్నారని,బీజేపీపై ఆరోపణలను నెడుతున్నారని మండిపడ్డారు. కానీ ప్రజా తీర్పు చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
కర్రుకాల్చి వాత పెట్టారు..
పదేళ్లు తనదే అధికారమని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమబాట పడతామన్నారు. ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా మరింత పటిష్టం అవుతున్నామని చెప్పారు. గత నాలుగు నెలలుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఒకటి రెండు నెలల్లోనూ అన్ని కమిటీలను పూర్తి చేసుకొని రాష్ర్టంలో బలమైన శక్తిగా ప్రజా సమస్యలపై ముందుకు వెళ్లి పోరాడతామన్నారు. ఉపాధ్యాయుల్లో సమస్యలపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. బీజేపీ తరఫున శాసనమండలిలో అన్ని సమస్యలై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రశ్నిస్తామని అన్నారు. తమ ముగ్గురు సభ్యులు కూడా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తామని అన్నారు. బీజేపీ కార్యకర్తలను అనేక రకాలుగా వేధించారని ఆరోపించారు. బీజేపీని ఓడించాలని కుట్రలు పన్నినా ప్రజలు తమనే నమ్మి గెలిపించారన్నారు. గెలిచినందుకు అతి ఉత్సాహం ఏమీ లేదని, తమ వంతు బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఎంపీలు 8, ఎమ్మెల్యేలు, 8, ఎమ్మెల్సీలు 3 రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయత్తం అవుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రాష్ర్టంలో మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ అనే నినాదంతో ముందుకు వెళతామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోమారు బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రెఫరెండమా? వైఫల్యమా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి
కాంగ్రెస్ రెఫరెండమా, వైఫల్యమా? ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా అన్ని హామీలను అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల ఆశీర్వాదాలతో గెలిచామని స్పష్టం చేశారు. అవకాశవాదం కోసం కలిసే అలవాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకే ఉందని చరిత్ర చెబుతుందని, ఇది నగ్నసత్యమని వారికి జవాబు చెప్పాల్సిన ఖర్మ ఏం పట్టలేదని అన్నారు. వారి అసమర్థతను ఇతర పార్టీలపై రుద్ధడం వారికి అలవాటుగా మారిందన్నారు. ఇది సాక్షాత్తూ తెలంగాణ ప్రజల్లో ఈ రెండు పార్టీలపై వస్తున్న వ్యతిరేకత అని గుర్తించాలన్నారు. ఇప్పటికైనా సమస్యలపై చర్చించేందుకు సిద్ధమేనన్నారు. పనికిరాని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమను ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. వారు తమ వెంట ఉంటే చాలన్నారు. మూడు రాష్ర్టాలలో ఓడించి ప్రజలు కాంగ్రెస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పారు. మోదీ ఆధ్వర్యంలో ఇది తప్పదని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు