ముంబయి: 6 మార్చి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 22,400 మార్క్ పైన ప్రారంభమైంది.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 77 పాయింట్లు పెరిగి 73,807 వద్ద.. నిఫ్టీ (Nifty) 28 పాయింట్లు పెరిగి 22,366 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, జొమాటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు