తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.) రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివని, అలాంటి కార్మికులకు వేతనాలు తగ్గిస్తూ జీవో జారీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాటి నుండి నేటి వరకు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోకుండా, మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్సెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీజేపీ పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్