సినీ.దర్శకుడు.రాంగోపాల్ వర్మ కు.ముంబై కోర్టులో గట్టి ఎదురు దెబ్బ
ముంబయి:, 7 మార్చి (హి.స.) సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ముంబయి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్కు బౌన్స్‌ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. బెయిల్‌కు వీల్లేని వారెంట్‌ (ఎన్‌
సినీ.దర్శకుడు.రాంగోపాల్ వర్మ కు.ముంబై కోర్టులో గట్టి ఎదురు దెబ్బ


ముంబయి:, 7 మార్చి (హి.స.)

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ముంబయి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్కు బౌన్స్‌ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. బెయిల్‌కు వీల్లేని వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. జనవరి 21న అంధేరీలోని జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఫస్ట్‌క్లాస్‌) వై.పి.పూజారి తీర్పు వెలువరిస్తూ... నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ నిబంధనల ప్రకారం రామ్‌గోపాల్‌ వర్మ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. దోషికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. దీంతో పాటు ఫిర్యాదుదారుకు మూడు నెలల్లోగా రూ.3,72,219 చెల్లించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రామ్‌గోపాల్‌ వర్మ సెషన్స్‌ కోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఈ నెల 4న అదనపు సెషన్స్‌ జడ్జి ఎ.ఎ.కులకర్ణి ఈ అప్పీల్‌ను తిరస్కరిస్తూ రామ్‌గోపాల్‌ వర్మకు వ్యతిరేకంగా బెయిల్‌కు వీల్లేని వారెంట్‌ జారీ చేశారు. జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ విధించిన జైలు శిక్షను రద్దు చేసేందుకు నిరాకరించారు. అయితే, నిందితుడు రామ్‌గోపాల్‌ వర్మ కోర్టు ఎదుట హాజరై బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని జడ్జి తెలిపారు. వారెంట్‌ అమలు కోసం కేసు విచారణను జులై 28కి వాయిదావేశారు. రామ్‌గోపాల్‌వర్మకు చెందిన సంస్థ తమకు జారీ చేసిన చెక్కు బ్యాంకులో చెల్లలేదంటూ 2018లో మరో కంపెనీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande