విజయవాడ, 8 మార్చి (హి.స.)
బెంగళూరు(శివాజీనగర), దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో దొరికిపోయిన నటి రన్యారావు(34)ను మూడు రోజులపాటు విచారించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)కు అనుమతిస్తూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. రన్యారావు నుంచి డీఆర్‌ఐ అధికారులు ఇప్పటికే 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు జప్తు చేసుకున్నారు. గత ఆరు నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చిందని, దాంతో పాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకూ ఆమె ప్రయాణించినట్లు డీఆర్‌ఐ అధికారులు తాజా విచారణలో గుర్తించారు. మరోవైపు సంఘవిద్రోహ శక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించిన అధికారులు ఆ దిశగానూ విచారిస్తున్నారు. కాగా బెయిలు కోసం ప్రత్యేక న్యాయస్థానంలో రన్యారావు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల