విజయవాడ, 8 మార్చి (హి.స.)
రంగారెడ్డి జిల్లా టంగుటూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో శంభారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం టంగుటూరులో లొకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం కావడంతో శంబారెడ్డి స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురికి తరలించారు.
ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు మోకిలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ మోకిలా చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. శంబారెడ్డి ఎలా మృతి చెందాడో తేలాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతదేహాన్ని మార్చురీకి ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల