తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 8 మార్చి (హి.స.)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పెద్దపులి సంచారం మళ్లీ కలవర పెడుతుంది. పల్గుల గ్రామ శివారు అడవిలో పులి పాదముద్రలు, సేదతీరిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. కాగా.. పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గత 25 రోజులుగా మహదేవపూర్, కాటారం రేంజ్ పరిధిలోని అడవుల్లో పులి కలియ తిరుగుతుంది. ఒక చోటు నుండి మరో చోటుకు తన ఆవసాన్ని మార్చుతుంది. గోదావరి దాటి మంచిర్యాల జిల్లాలోకి వెళ్లెందుకు మళ్లీ పులి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.
గత వారం క్రితం మహదేవపూర్ మండలంలోని ఏన్కపల్లి అడవుల నుంచి ప్రతాపగిరి అడవుల వైపు పెద్దపులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అంతకుముందు కూడా కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లోని అడవుల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అడవుల చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు, ఇతరులు అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్