హైదరాబాద్: , 8 మార్చి (హి.స.), హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనల్లో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారమవుతుందని ఇప్పటివరకు భావించారు. ఈ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది. 30 అడుగుల ఎత్తుతో 62.5 కి.మీ. మేర నిర్మించేలా ఎలైన్‌మెంట్‌నూ రూపొందించారు. అయితే, ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచించింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయ చర్యల్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ ముఖ్య అధికారి ఒకరు.. హైదరాబాద్-శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించారు. ఈ నేపథ్యంలో కొద్దివారాల్లో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అధ్యయనం చేయించనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల