విజయవాడ, 9 మార్చి (హి.స.)
: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తెదేపాలోని ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆదివారం ఏ క్షణానైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఆశావహులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో వారు ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు.
అమరావతిలోనే మకాం వేసిన ఆశావాహులు.. ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌ని కలిసి తమ అనుకూలతలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కుల, మత, ప్రాంతాల వారీగా సమీకరణలు బేరీజు వేసి ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల