బళ్లారి, 9 మార్చి (హి.స.)హంపి పర్యటనకు వచ్చిన విదేశీ మహిళ, స్థానికంగా హోం స్టే నిర్వహిస్తున్న మరో మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. బరితెగించిన ఆ ముగ్గురిలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ ఎల్ అరసిద్ద తెలిపిన వివరాల మేరకు.. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ(27), హోం స్టే నిర్వాహకురాలు(29), అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాష్.. హంపి సమీపంలోని సనాపుర వద్ద తుంగభద్ర నది ఒడ్డున గురువారం సేదదీరుతున్నారు. వీరి వద్దకు ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చారు. పెట్రోల్‌కు డబ్బులు కావాలని అడిగారు. విదేశీ మహిళ వారికి రూ. 20 ఇవ్వగా, రూ. 100 కావాలని డిమాండ్ చేశారు. దీనికి నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. రాళ్లతో దాడి చేశారు. ఇద్దరు మహిళలు మినహా.. మిగిలిన ముగ్గురినీ నీటిలోకి తోసేశారు. అనంతరం హోం స్టే నిర్వాహకురాలిపై ఇద్దరు, విదేశీ మహిళపై ఒకరు అత్యాచారం చేశారు. నీటిలో పడిన ముగ్గురిలో డేనియల్, పంకజ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బిబాష్ మాత్రం నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహం శుక్రవారం నీటిపైకి తేలింది. అత్యాచారానికి పాల్పడినవారిలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా సాయినగర్‌కు చెందిన మల్లేశ్ (22) అలియాస్ హండి మల్లా, చేతన్ సాయి(21)లను అరెస్టు చేశారు. మూడో వ్యక్తి కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన గురువారం రాత్రి 11.30 ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీవ్రంగా ఖండించారు. అత్యాచారానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల