కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 45కు పెరిగిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు
హైదరాబాద్, 1 జూలై (హి.స.) సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 45 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పల
ఫ్యాక్టరీ బ్లాస్ట్


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 45 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణించినవారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను గుర్తించగా, మరో 20 గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సోమవారం జగన్మోహన్, రామ్సింగ్ రాజ్బర్, శశిభూషణ్ కుమార్ మృతిచెందినట్లు గుర్తించగా, తాజాగా మరో ఆరుగురి పేర్లను అధికారులు ప్రకటించారు. లగ్నజిత్ దౌరి, బీ. హేమ సుందర్, రుక్సానా కతూన్, జీ. నికిల్ రెడ్డి, నాగేశ్వర్ రావు, పొలిషెట్టి ప్రసన్నగా గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉన్నది. అయితే మృతుల సంఖ్య 55కు పెరిగే అవకాశం ఉంది.

బాయిలర్ పేలడంతో మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ శిథిలాల కింద 20 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం ఎస్ఈఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande