హర్యానా, 1 జూలై (హి.స.)
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లో ఒకటైన యమునానగర్లోని సరస్వతి షుగర్ మిల్లులో భారీ నష్టం సంభవించింది. వరదనీరు మిల్లులోకి ప్రవేశించి, అక్కడ నిల్వ ఉంచిన లక్షల క్వింటాళ్ల పంచదారను తడిపేసింది. మిల్లులో మొత్తం రూ.97 కోట్ల విలువ గల 2.20 లక్షల క్వింటాళ్ల పంచదారను నిర్వాహకులు నిల్వ ఉంచారు. అయితే వరద నీటి ప్రభావంతో దాదాపు 1.20 లక్షల క్వింటాళ్ల పంచదార తడిసి, కరిగిపోయింది. దీనివల్ల రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య నష్టం వాటిల్లింది.
ఈ ఘటనపై సరస్వతి మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ ' వరద నీరంతా మిల్లులోకి చేరింది. దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువైన చక్కెర కరిగిపోయింది. అయితే, నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. మిల్లు మొత్తం తనిఖీ చేసిన తర్వాత నష్టంపై ఓ అంచనాకు రావొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..