అమరావతి, 1 జూలై (హి.స.)
పుత్తూరు, అప్పటిదాకా హాయిగా నవ్వుతూ గడిపిన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. చేతికందివచ్చిన కొడుకు వాహనం నడుపుతూ ఉంటే వెనక కూర్చొన్న ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. అంతలోనే వీరి అన్యోన్యతను చూసిన విధి కన్ను కుట్టింది. సరకు రవాణా వాహన రూపంలో మృత్యువు కాటేసింది. ఈ దుర్ఘటనలో కొడుకు కళ్లెదుటే తండ్రి దుర్మరణం పాలవడంతో అతడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. హృదయ విదారక ఘటనకు సంబంధించి ఎస్సై ఓబయ్య కథనం మేరకు.. పుత్తూరు మండలం ఎగువ కనకంపాళెం గ్రామానికి చెందిన వి.సుబ్రహ్మణ్యం(56)కు భార్య గీత, ఇద్దరు కుమారులు సాయిభార్గవ్, జ్ఞానసాగర్. పెద్ద కుమారుడు సాయిభార్గవ్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. చిన్న కుమారుడు జ్ఞానసాగర్ సీఏ పూర్తి చేసి చెన్నైలోనే ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు నేపథ్యంలో ఇద్దరు కుమారులు ఇంటికొచ్చారు. సోమవారం ఉదయం చిన్నకుమారుడు పుత్తూరు నుంచి ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్లాడు. పెద్దకుమారుడు సాయిభార్గవ్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్లేందుకు స్కూటీలో తండ్రితో కలిసి పుత్తూరుకు బయల్దేరాడు. బైపాస్ రోడ్డులోని సీటీఆర్‌నత్తం పైవంతెన వద్ద చెన్నై నుంచి తిరుపతి డీమార్ట్‌కు సరకులు తీసుకెళ్తున్న ఓ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో స్కూటీలో వెనక కూర్చున్న సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న సాయిభార్గవ్‌కు తీవ్రగాయాలవడంతో అతడికి పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి తిరుపతిలోని అమరా ఆసుపత్రికి తరలిచి పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ