అమరావతి, 1 జూలై (హి.స.)బీజేపీ(BJP)లో చేరినప్పటి నుంచి పార్టీ తనను గౌరవిస్తూనే ఉందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఎంపీ పురందేశ్వరి(MP Daggubati Purandeswari) స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్(Former MLC Madhav) ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతలు(BJP Leaders) శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) ఏపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవం సభలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2013లో బీజేపీలోకి వచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షురాలిగా రెండేళ్లలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేశానని ఆమె పేర్కొన్నారు. ఈ తరుణంలో ఎందరో పెద్దలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఎంపీ పురందేశ్వరి తెలిపారు. పట్టుదలతో వారి అడుగుజాడల్లో నడిచానన్నారు. స్వలాభాపేక్ష అనేది నేను ఎప్పుడూ చూడలేదు. కొన్ని నిర్ణయాలు నచ్చకున్నా.. అధిష్ఠానంతో ఏకిభవించాను. ఈ క్రమంలో రెండేళ్లలో తనను ప్రోత్సహించిన వారికి, అలాగే తనను ప్రతిఘటించిన వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పదవులు శాశ్వతం కాదని నాకు తెలుసు అని ఆమె తెలిపారు.
ఏపీ(Andhra Pradesh)లో కూటమి పార్టీల భాగస్వామ్యంతో అధికారంలో ఉన్నామని.. దీనికి కార్యకర్తల కృషి ఎంతో ఉందని తెలిపారు. నా రెండేళ్ల ప్రస్థానంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేశాను. ఈ క్రమంలో నేడు మాధవ్‌కు అధ్యక్ష బాధ్యత అప్పగించామని.. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వెళతారని ఆశిస్తున్నాను అని ఆమె తెలిపారు. నా మీద నమ్మకం ఉంచి బాధ్యత ఇచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎంపీ పురందేశ్వరి ధన్యవాదాలు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి