దిల్లీ, 10 జూలై (హి.స.)భారతదేశం నుంచి దిగుమతి అయ్యే మందులపై 200% పన్నులు విధిస్తాం, ఈ వడ్డింపునకు సిద్ధంగా ఉండండి’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికలపై దేశీయ ఫార్మా వర్గాలు అసహనానికి గురవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు నిలకడ లేకుండా ఏది తోస్తే, అది మాట్లాడుతున్నారని.. ఇది కనుక అమల్లోకి వస్తే ఔషధ పరిశ్రమకే కాక, అమెరికా ప్రజలకూ నష్టం చేస్తుందని పేర్కొంటున్నారు. ఇంత అధికంగా పన్నుల భారం మోపితే, మందుల ధరలు పెరిగి అమెరికా ప్రజలే ఇబ్బంది పడతారని.. వారి ఆరోగ్య బీమా ఖర్చులూ అనూహ్యంగా పెరుగుతాయని వివరిస్తున్నారు. అదే సమయంలో మన ఫార్మా కంపెనీలకూ కష్టాలు తప్పవు. మందులను ఎగుమతి చేయడానికి ఇతర దేశాలను అన్వేషించడం పెరుగుతుంది.
అంచనాలకు 10 రెట్లు అధికంగా..
అమెరికా దిగుమతి చేసుకునే మందులపై 10 - 20% అదనపు పన్ను మోపుతారనే ఆందోళన ఇంతకాలం ఉంది. అదే ఇబ్బందికరమని భావిస్తుంటే, ఏకంగా 200% పన్ను వేస్తామని ట్రంప్ పేర్కొనడాన్ని దేశీయ ఫార్మా వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇది సాధ్యమయ్యేది కాదనే అభిప్రాయాన్ని అధికులు వ్యక్తం చేస్తున్నారు. చైనాపై భారీగా సుంకాలు వేసి, ఆనక తగ్గింపునకు అమెరికానే చర్చలకు ముందుకు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు