హైదరాబాద్, 10 జూలై (హి.స.)దిల్లీ: ఉత్తర భారత వాసులను భూకంపం (Earthquake) వణికించింది. దేశ రాజధాని దిల్లీ, ఎన్‌సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 9.04 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది.
హరియాణాలోని ఝజ్జర్‌కు ఈశాన్యాన 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతం పశ్చిమ దిల్లీకి కేవలం 51 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీంతో దేశ రాజధానిలో ప్రకంపనలు భారీగానే చోటుచేసుకున్నాయి. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది.
గతంలో పోలిస్తే ఈ సారి ప్రకంపనల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. భూమి కంపించడంతో అనేక చోట్ల ప్రజలు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అటు ఎన్డీఆర్‌ఎఫ్ దీనిపై అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఇలాంటి సమయాల్లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు దిగి కిందకు రావాలని సూచించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు