తిరుమల, 11 జూలై (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని.. వారిని వెంటనే తొలగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా నేడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీ కి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకున్నానని చెప్పారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు టీటీడీని వాడుకోవద్దంటూ బండి రిక్వెస్ట్ చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్