న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.)
బీసీలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మోసం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం అంటే బీసీలను మరోసారి మోసగించడమేనని అన్నారు. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ బిల్లుపై ఏమి తేల్చకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉందని తెలిపారు.
రిజర్వేషన్లు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉందో లెక్కలు తేలిస్తే న్యాయస్థానాల్లో వాదన నిలబడే అవకాశం ఉందని లక్ష్మణ్ చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివిధ కులాలకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి దగ్గర 42శాతం రిజర్వేషన్‌లకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తే ఆ బిల్లుకి గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..