విశాఖలో నగర అందాలను.వీక్షించేందుకు కొత్త రోప్ వే ఏర్పాటు
అమరావతి, 12 జూలై (హి.స.) ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగర అందాలను వీక్షించేందుకు కైలాసగిరి వద్ద కొత్త పర్యాటక సౌకర్యాలు కల్పించేలా విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే కొండపై జిప్‌లైనర్, స్కై సైక్లింగ్‌ నిర్వహిస
విశాఖలో  నగర అందాలను.వీక్షించేందుకు కొత్త రోప్ వే ఏర్పాటు


అమరావతి, 12 జూలై (హి.స.)

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగర అందాలను వీక్షించేందుకు కైలాసగిరి వద్ద కొత్త పర్యాటక సౌకర్యాలు కల్పించేలా విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే కొండపై జిప్‌లైనర్, స్కై సైక్లింగ్‌ నిర్వహిస్తున్నారు. త్వరలో ‘గ్లాస్‌ బ్రిడ్జి’ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం: ప్రస్తుతమున్న రోప్‌వేను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహిస్తోంది. లీజు ముగియడంతో లైసెన్సు రద్దు చేసి అక్కడ కొత్తది నిర్మించనున్నారు. ప్రస్తుతమున్న రోప్‌వే క్యాబిన్లు పాత తరహాలో ఉన్నాయి. కింది నుంచి కేవలం 400 మీటర్లే ప్రయాణిస్తుంది. దీంతో పర్యాటకులకు ఇందులో ప్రయాణించిన అనుభూతి కలగడం లేదు.

ఇదీ ఆలోచన: కొత్తగా నిర్మించే రోప్‌వే కొండ కింద సముద్రం సమీపంగా తెలుగు మ్యూజియం వరకు వెళ్లేలా మార్గం నిర్ణయించారు. నిర్మించు, నిర్వహించు, అప్పగించు (బీవోటీ) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 22న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆగస్టు అయిదో తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

కైలాసగిరి కేంద్రంగా: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు కైలాసగిరి కేంద్రంగా విశాఖలో పర్యాటక సౌకర్యాల కల్పన పెంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ‘గ్లాస్‌ బ్రిడ్జి’ ఆగస్టుకు అందుబాటులోకి వస్తుంది. అత్యాధునిక రోప్‌వే ప్రజలకు గొప్ప అనుభూతి కలిగిస్తుంది’ అని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande