తిరుమల, 12 జూలై (హి.స.)
, : శ్రీవారి భక్తులు పలు అతిథిగృహాల్లో పోగొట్టుకున్న, మరిచిపోయిన బంగారు వస్తువులను తితిదే అధికారులు వారికి శుక్రవారం అప్పగించారు. స్థానిక రాంభగీచా అతిథిగృహంలో విజయనగరానికి చెందిన మాలేడా బ్రహ్మం గదిని పొందారు. శ్రీవారి దర్శనానంతరం రూ.3.20 లక్షల బంగారు గొలుసును గదిలో మరచిపోయి వెళ్లారు. గది శుభ్రం చేసే సిబ్బంది గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు భక్తుడికి తెలిపారు. తితిదే మేనేజర్ కామరాజు, ఓఎస్‌వో పీజీ సురేష్ భద్రతా సిబ్బంది సమక్షంలో భక్తుడికి సొత్తు అందజేశారు.
వకుళమాత అతిథిగృహంలో పల్నాడు జిల్లా వెల్లిటూరుకు చెందిన బి.సుధాకర్ కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 10న గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలో బంగారు ఉంగరం మరిచిపోగా పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించి అతిథిగృహం సూపరింటెండెంట్లు శ్రీరామ్, శ్రీనివాసులుకు తెలిపారు. వెంటనే వారు భక్తుడికి తెలిపి కార్యాలయంలో ఉంగరాన్ని అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ