సంగారెడ్డి, 11 జూలై (హి.స.) సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారం జాతీయ రహదారి పక్కన గల హనుమాన్ మందిరంలో విగ్రహాల ధ్వంసం స్థానికంగా వివాదం సృష్టించింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్, బీజేపీ మండల అధ్యక్షుడు కావలి వీరేశం తో పాటు పలువురు హిందూ సంఘాల నాయకులు, బిజెపి నాయకులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన పట్టారు. విగ్రహ అంశానికి సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో అక్కడికి చేరుకున్న పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ ఆందోళనకారులను శాంతింప చేశారు. ఈ వ్యవహారం పై పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు. అయితే ఆలయంలోని సీసీ కెమెరాలు సైతం దుండగుడు ధ్వంసం చేశాడని, మతిస్థిమితం లేని వాడిగా నటిస్తున్నాడని హిందూ సంఘాల
ప్రతినిధులు ఆరోపించారు.
విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రుద్రారంలోని
హనుమాన్ దేవాలయ సంఘటన స్థలాన్ని సందర్శించి, ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసం ఘటన దురదృష్టకరమన్నారు. పటాన్ చెరు ప్రాంతం పర మత సహనానికి ప్రతీక అన్నారు. హిందువులందరూ ఈ విషయంలో శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ధ్వంసమైన విగ్రహాలను త్వరలో పునః ప్రతిష్టిస్తామని తెలిపారు. అయితే బీజేపీ నాయకుల సమాచారంతో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఘటన స్థలానికి రానున్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..