హైదరాబాద్, 11 జూలై (హి.స.)
పదవుల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, తుది శ్వాస వరకు సమాజ సేవలో నిమగ్నమవుతానని, హిందూ సమాజం హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు..బీజేపీ అధిష్ఠానం తన రాజీనామాను ఆమోదించిన అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, సుమారు 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున తాను బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పాటు హిందువుల హక్కుల పరిరక్షణ కోసం తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ తరువాత బీజేపీ తనపై నమ్మకంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టును ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన బీజేపీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.తన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్