న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.)
ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో ఈ ఉదయం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు, నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. స్థానికులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలినట్టు ఉదయం ఏడు గంటలకు ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఉదయం తాను మంచంపై ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, బయటకు వచ్చిచూస్తే ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము పేరుకుపోయి ఉందని, అందరూ ఏడుస్తున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. భవనం కూలినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియరాలేదు.
అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..