ఢిల్లీ, 12 జూలై (హి.స.): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణని ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.
ప్రత్యేక సవరణకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూనే ఈసీకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఇదే ప్రక్రియను చేపట్టనుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ఈసీ అధికారులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ