తెలంగాణ, నిజామాబాద్. 12 జూలై (హి.స.)
సెల్ ఫోన్ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ ను వెంబడించి లూటీ చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వ్యాన్‌ని వెంబడించిన దుండగులు లక్షల విలువ చేసే ఫోన్లను కొట్టేశారు. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వివరాలలోకి వెళితే, నిజామాబాద్ జిల్లా టేక్రియాల్ బైపాస్ రోడ్డుపై సెల్ ఫోన్స్ లోడ్‌తో ఓ వ్యాన్ వెళ్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వ్యాన్‌ని వెంబడించారు. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వ్యాన్ ఆపకపోతే చంపేస్తామంటూ డ్రైవర్‌ను బెదిరించారు. దీంతో భయపడ్డ డ్రైవర్ వ్యాన్ ఆపాడు. ఈ క్రమంలో సుమారు 4లక్షల విలువ చేసే ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు