అమరావతి, 14 జూలై (హి.స.)
తిరుమల, తిరుపతి (తితిదే), తిరుమలలో వారాంతపు సెలవుల నేపథ్యంలో అకస్మాత్తుగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగురోడ్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని అత్యధికంగా 92,221 మంది దర్శించుకున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 16 గంటలు పడుతోంది. రద్దీతో ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లభించక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇచ్చే భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లల్లో వేచి చూస్తున్నారు. మరుసటి రోజైనా దొరుకుతాయన్న ఆశతో ఇక్కడే వసతి లేకపోయినా ప్లాంట్‌ఫాంలు, రోడ్లపై టోకెన్లు ఇచ్చే కేంద్రాల సమీప ప్రాంతాల్లో తినీతినక గడిపేస్తున్నారు. తితిదే ఉన్నతాధికారులు టోకెన్ల కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించి, వారాంతాల్లో టోకెన్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ