హైదరాబాద్, 14 జూలై (హి.స.)
గురుకుల హాస్టల్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చనిపోయిన గురుకుల విద్యార్థిని ఫొటోను షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని జ్యోతిబాపూలే హాస్టల్లో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణం అని కేటీఆర్ పేర్కొన్నారు.
పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్న చిన్నారులు కనీస సౌకర్యాలు లేని హాస్టల్లో ఉండలేక చివరికి ప్రాణాలు తీసుకోవడం గురుకులాల దుస్థితికి అద్దం పడుతోందని తెలిపారు. ఇప్పటికే గురుకులాల్లో 90 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించినా ముఖ్యమంత్రికి సోయి రావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా గురుకులాల్లో మోగుతున్న ఈ మరణమృదంగాన్ని ముఖ్యమంత్రి ఆపకపోతే తల్లిదండ్రుల శాపనార్థాలు తగిలి ఈ కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయమని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్