తిరుపతి , 14 జూలై (హి.స.)తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం (Renigunta Fire Accident) జరిగింది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో (Chromo Medicare Factory) రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ? ప్రాణ నష్టం జరిగిందా ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలో పాశమైలారం సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలి సుమారు 40 మంది మరణించిన విషాద ఘటన ఇంకా మరిచిపోకముందే ఏపీలో అలాంటి ప్రమాదమే జరగడం అందరినీ కలవరపెడుతోంది. ఫ్యాక్టరీలు కనీస నాణ్యతా ప్రమాణాలు, జాగ్రత్త చర్యలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి