న్యూఢిల్లీ, 15 జూలై (హి.స.)
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేపాయి. నిన్న రెండు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నేడు ఓ పాఠశాల మరియు కళాశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలకు మంగళవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ద్వారక ప్రాంతంలోని సెయింట్ థామస్ పాఠశాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల, పాఠశాల యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఖాళీ చేయించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ బృందం, ప్రత్యేక సిబ్బంది సహా ఎమర్జెన్సీ సర్వీసెస్ టీమ్లు హుటాహుటిన ఆ రెండు ప్రదేశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఇప్పటి వరకూ ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..