అమరావతి, 15 జూలై (హి.స.) గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సమావేశం జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అంశాలతో పాటు ఇతర ఎజెండా పాయింట్లను సమర్పించాలని జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరింది.
నిజానికి ఈ సమావేశం ఈ నెల 11న జరగాల్సి ఉండగా, సీఎంల అభ్యర్థన మేరకు 16వ తేదీకి వాయిదా పడింది. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ తేదీని ఖరారు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలను జలశక్తి మంత్రి చైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. ఈ భేటీ అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా పరిగణించబడుతుందా? లేదా? అనేది స్పష్టంగా తెలియలేదు.
గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. గోదావరిలో సంవత్సరానికి 2,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తోందని, ఈ జలాలను ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం అవసరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఈ జలాలను వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని, కేంద్రం సమక్షంలో చర్చల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి